కేఆర్‌‌ఎంబీకి ఒక లెక్క.. ప్రజలకు ఇంకో లెక్కనా? : హరీశ్‌‌రావు

కేఆర్‌‌ఎంబీకి ఒక లెక్క.. ప్రజలకు ఇంకో లెక్కనా? : హరీశ్‌‌రావు
  •     కృష్ణా నీళ్ల వినియోగంపై అబద్ధాలు ప్రచారం చేస్తూ తప్పులు కప్పిపుచ్చుకుంటున్నరు
  •     మంత్రి ఉత్తమ్‌‌పై హరీశ్‌‌రావు ఫైర్

హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల వినియోగం విషయంలో ఇరిగేషన్​మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని, పచ్చి అబద్ధాలతో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌‌రావు ఫైర్ అయ్యారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌‌ఎంబీ) వద్ద ఒక లెక్క.. తెలంగాణ ప్రజల ముందు మరో లెక్క చెబుతూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ట్వీట్‌‌కు ‘ఎక్స్’ వేదికగానే కౌంటర్ ఇచ్చారు.

కృష్ణా జలాల వినియోగంపై మంత్రి చెబుతున్నవన్నీ కట్టుకథలని విమర్శించారు. కేఆర్‌‌ఎంబీ 21వ సమావేశం కోసం ప్రభుత్వం సమర్పించిన ఎజెండాలోని అంశాలు వేరుగా ఉన్నాయన్నారు. 'ప్రభుత్వ ఎజెండా ప్రకారం.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ 45.791 టీఎంసీల నీటిని బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తరలించుకుపోయింది. అదే సమయంలో తెలంగాణ మాత్రం కల్వకుర్తి ద్వారా బేసిన్ పరిధిలోని మన ప్రాంత  అవసరాల కోసం వినియోగించింది 10.653 టీఎంసీల నీరు మాత్రమే.

ప్రభుత్వం బోర్డుకు సమర్పించిన ఎజెండాలో ఈ లెక్కలు ఉంటే.. మీరు ట్వీట్‌‌లో ఇంకో లెక్క ఎలా చెబుతారు? ఈ రెండింటిలో ఏది నిజం? ఉత్తమ్ గారూ.. మీరు కేఆర్‌‌ఎంబీని తప్పుదోవ పట్టిస్తున్నారా? లేక తెలంగాణ సమాజాన్ని మభ్యపెడుతున్నారా? ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీపై లేదా?' అని నిలదీశారు. బ్యారేజీలు, ప్రాజెక్టులపై తప్పుడు లెక్కలు, కట్టుకథలు చెప్పినంత మాత్రాన వాస్తవాల నుంచి కాంగ్రెస్ తప్పించుకోలేదన్నారు.
 

మరిన్ని వార్తలు